హైదరాబాద్, ఏప్రిల్ 5: కాంగ్రెస్ పార్టీకి కడప ఎన్నికలు ‘సవాల్’గా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రికి ప్రతిష్టగా నిలిచాయి. కడప లోక్‌సభకు, పులివెందుల అసెంబీకి జరగబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పార్టీ అధిష్ఠానం వద్ద తన ‘ఇమేజ్’ను పెంచుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్ధల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కడప మాజీ లోక్‌సభ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. కాబట్టి కడప లోక్‌సభ, పులివెందుల స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఆ జిల్లాకు చెందిన నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అయితే జగన్ వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై.ఎస్. వివేకానంద రెడ్డిని పోటీ చేయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 16న వివేకా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా కడప లోక్‌సభ నియోజకవర్గంలో వై.ఎస్. వివేకానంద రెడ్డిని ఎదుర్కొనే అంశంపైనే వారు ప్రధానంగా చర్చించారు. కడప లోక్‌సభకు మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డిని పోటీ చేయించాలని మొదట భావించినా, పోటీకి డిఎల్ అంతగా సుముఖంగా లేరన్న విషయాన్ని తెలుసుకుని, వరదరాజులు రెడ్డిని పోటీ చేయిస్తే బాగుంటుందని వారు నిర్ణయించారు. అయితే ఇటీవలే తాను ఓడిపోయి, మరోసారి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని వరదరాజులు రెడ్డి అంటున్న విషయాన్ని వారు చర్చించారు. తన రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ చూపిస్తేనే పోటీ చేస్తానని వరదరాజులు రెడ్డి గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీంతో వారు కందుల రాజమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కూడా చర్చించారని తెలిసింది. మరోవైపు బిసి అభ్యర్థిని పోటీ చేయిస్తే అనుకూలంగా ఉంటుందా? అనే అంశాన్ని కూడా వారు పరిశీలించారు. దీనిపై తర్జన-్భర్జన జరిగింది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే పోటీ చేయించాలని నిర్ణయించారు. కాగా సమావేశం మధ్యలో వారు రామచంద్రయ్యనూ సిఎం క్యాంప్ ఆఫీసుకు పిలిపించారు. డిఎల్, కందుల రాజమోహన్ రెడ్డి, వరదరాజులురెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పేర్లను పరిశీలించినా చివరకు వరదరాజులు రెడ్డినే పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశానంతరం 20 సూత్రాల పథకం చైర్మన్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు చెప్పారు. బుధవారం పార్టీ అధిష్ఠానం ఆమోదం తీసుకుని మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రచారంపై దృష్టి..
ఎన్నికల ప్రచారం, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలు, మండల వారీగా కన్వీనర్ల నియమాకం ఇతరత్రా అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, పిఆర్‌పి అధ్యక్షుడు చిరంజీవి ప్రభృతులు ప్రచారంలో పాల్గొంటారు.
No comments:
Post a Comment